![]() |
![]() |

ప్రయాగ్‌రాజ్ కుంభమేళాలో రుద్రాక్ష మాలలు అమ్ముతూ, తన అందమైన చిరునవ్వుతో, తేనే కళ్ళతో ఓవర్ నైట్ స్టార్ డమ్ సంపాదించింది మోనాలిసా భోస్లే. హీరోయిన్ గా కూడా పలు చిత్రాలు ఒప్పుకున్న మోనాలిసా ఆ తర్వాత మొహమ్మద్ ఫర్మాన్ ని ప్రేమ వివాహం చేసుకొని వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం తన ప్రాణాలని కాపాడుకోవడానికి పోలీసు స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కేరళలోని కొచ్చి నగరంలో ఉన్న ఎర్నాకుళం సెంట్రల్ పోలీస్ స్టేషన్‌కు తన న్యాయవాదితో కలిసి వచ్చిన మోనాలిసా, తన తండ్రిపై అత్యంత తీవ్రమైన ఆరోపణలు చేస్తూ రాతపూర్వక ఫిర్యాదు అందజేసింది. తన ప్రాణాలకు తీవ్రమైన ముప్పు పొంచి ఉందని, తనకు వెంటనే రక్షణ కల్పించాలని ఆమె పోలీసులను వేడుకోవడం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. తన సంపాదన, తన భవిష్యత్తును తన కుటుంబమే కాలరాస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
ఈ ఫిర్యాదులో మోనాలిసా తన తండ్రిపై సంచలన ఆరోపణలు చేసింది. తన తండ్రి తన పాస్‌పోర్ట్‌తో పాటు తన కష్టార్జితమైన డబ్బును పూర్తిగా లాగేసుకున్నారని, తన ఆధీనంలో ఉంచుకున్నారని, నా తండ్రి వల్లే నా ప్రాణాలకు ముప్పు ఉంది, నన్ను కాపాడండి" అంటూ మీడియా ముందు కన్నీరు పెట్టుకుంది. మధ్యప్రదేశ్ నివాసి అయిన మోనాలిసా, కుంభమేళాలో వైరల్ అయిన తర్వాత సినిమా అవకాశాల కోసం కేరళకు వచ్చింది. అక్కడ మలయాళ నటుడు, మోడల్ అయిన మొహమ్మద్ ఫర్మాన్ ఖాన్‌తో పరిచయం ఏర్పడి, అది కాస్తా ప్రేమగా మారింది. అనంతరం 2026 మార్చి 11న కేరళలో హిందూ సాంప్రదాయ పద్ధతిలోనే వీరిద్దరూ కులాంతర, మతాంతర వివాహం చేసుకున్నారు. అయితే ఈ పెళ్లి మోనాలిసా కుటుంబ సభ్యులకు అస్సలు నచ్చలేదు. ఆమె తండ్రి దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ మధ్యప్రదేశ్‌లో ఫర్మాన్ ఖాన్‌పై కిడ్నాప్ కేసు నమోదు చేశారు.
ఈ మొత్తం వివాదంలో మోనాలిసా వయస్సు గురించిన గొడవ అత్యంత కీలకమైన అంశంగా మారింది. మోనాలిసా తండ్రి వాదన ప్రకారం ఆమె మైనర్. హాస్పిటల్ రికార్డుల ప్రకారం ఆమె పుట్టిన తేదీ 2009 డిసెంబర్ 30 అని, అందువల్ల వివాహం సమయానికి ఆమె వయస్సు కేవలం 16 సంవత్సరాలేనని ఆయన వాదిస్తున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే ఫర్మాన్‌పై పోక్సో (POCSO) చట్టం కింద కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ మోనాలిసా, ఆమె భర్త ఫర్మాన్ ఖాన్ ఈ వాదనను తీవ్రంగా ఖండిస్తున్నారు. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ మరియు అధికారిక రికార్డుల ప్రకారం మోనాలిసా పుట్టిన తేదీ 2008 జనవరి 1 అని, ఆమెకు 18 సంవత్సరాల 3 నెలలు నిండాయని, ఆమె మేజర్ అని వారు నిరూపిస్తున్నారు. తన తండ్రి తన తమ్ముడి బర్త్ సర్టిఫికెట్‌ను చూపిస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ప్రభుత్వ పోర్టల్ నుండి తన ఒరిజినల్ సర్టిఫికెట్‌ను తొలగించేలా కుట్ర పన్నారని మోనాలిసా మధ్యప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ కూడా వేసింది.
కేరళ హైకోర్టు కూడా గతంలో ఈ పత్రాలను పరిశీలించి మోనాలిసా ప్రాథమికంగా మేజర్ లాగే కనిపిస్తోందని అభిప్రాయపడింది. అంతేకాకుండా గతంలో ఆమెకు పోలీస్ రక్షణ కల్పించాలని ఆదేశించింది. అయితే, ఆ తర్వాత మోనాలిసా మరియు ఫర్మాన్ ఖాన్ ఇద్దరూ నివాస స్థలాలు మారుస్తూ పోలీసులకు అందుబాటులో లేకపోవడంతో ఆ భద్రతను ఉపసంహరించుకున్నారు. తిరిగి ప్రాణభయం ఎక్కువ కావడంతో మోనాలిసా స్వయంగా కొచ్చి పోలీసుల ముందుకు వచ్చి రక్షణ కోరింది. మరోవైపు భర్త ఫర్మాన్ ఖాన్‌కు మధ్యప్రదేశ్ కోర్టు నుండి ముందస్తు బెయిల్ దొరకకపోవడంతో అతనిపై అరెస్ట్ తల్వార్ వేలాడుతోంది. సోషల్ మీడియాలో ఒక వెలుగు వెలిగిన ఒక వైరల్ స్టార్, ఇరు రాష్ట్రాల పోలీస్ కేసులు, కోర్టుల చుట్టూ తిరుగుతూ, "నా అకౌంట్లలోని డబ్బులు పోయాయి, చేతిలో పైసా లేదు, వేసుకున్న బట్టలతో మిగిలాను" అని ఆవేదన చెందుతున్న ఈ ఉదంతం సోషల్ మీడియా వైరల్ ప్రపంచం వెనుక ఉన్న భయానక నిజాన్ని ప్రతిబింబిస్తోంది.
![]() |
![]() |